Posted by: kondaveetisatyavati | August 25, 2007

Next Post

పాలపుంత

ఆగస్టు 2007 కొండవీటి సత్యవతి

“నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.”
“అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?”
“నీతో మాట్లాడుతున్నా”
“అబ్బో! జోకా?”
“పో… పోవోయ్‌ ఇంటి కెళ్లి సినిమా చూడు.”
“ఏ ఇంటికి?”
“ఏదో నీ ఇంట్లో చూడు ఫోన్‌ పెట్టేస్తున్నా”
“నీ ఇంటికే వస్తున్నా… కాచుకో”
“నిజంగా”
“అబద్దంగా”
“చచ్చేపనుందని నిన్న ఊదరగొట్టావ్‌”
“నీ దగ్గరకొచ్చా బతుకుదామని”
“రా మరి”
“తలుపు తియ్యిమరి” కాలింగ్‌ బెల్‌ మోగింది.
డోర్‌ తీస్తుంటే అతనికంటే ముందర పొగడపూల పరిమళం లోపలకొచ్చి గదినీ, ఆమెనీ కూడా చుట్టేసింది.
“దోసిలి పట్టు”
దోసిలి నిండా పొగడపూలు పోశాడు.
“ఇన్ని పూలు ఎక్కడివి నందూ”
“చెట్లవి”
“పొగడపూలు చెట్లకి పూస్తాయా? హృదయానికి అనుకున్నా”
“లుంబినీలో దొంగతనం చేశా”
దోసిలి అలాగే వుంచి చేతులు చాపింది.
ఆరడుగుల మనిషి అందంగా వొంగి ఆమె దోసిట్లో ముఖాన్నాన్చాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేనట్టేగా కొన్ని పూలు కిందకి జారిపోయాయి.
మెల్లగా ఆమె చుట్టూ చేతులేసి
“ఐలవ్‌ యూ మధూ”
“నా కోసం ఈ పూలన్నీ ఏరుకొచ్చావా?”
“నీ కోసం కాదు”
“మరి?”
“నా కోసమే”
“అదేంటి?”
“నీ దోసిట్లో పోసినప్పుడు నీ ముఖంలోని సంతోషాన్ని చూడ్డం కోసం.”
“అంత ప్రేమా?”
“ఇంత ప్రేమ” అంటూ గట్టిగా ఆమెను హత్తుకున్నాడు.
ఆ ఊపులో పూలన్నీ నేలమీద రాలి పోయాయి.
“అన్నీ కిందపడిపోయాయి ఫో…”
“మనం కూడా కింద పడితే సరిపోతుంది కదా?”
ఫక్కున నవ్వింది మధుర. ఆమె నవ్వులోని కాంతి అతని ముఖం మీద ప్రతిఫలించింది. బుద్ది మంతుడిలా పూలన్నీ ఏరి టేబుల్‌ మీద పోసాడు.
“మన పరిచయమై ఆరు నెలలా? అరవై సంవత్సరాలా మధూ”
“ఓయ్‌! నాకు నిండా మూడు పదుల్లేవు”
“అయినా టీనేజ్‌ అమ్మాయిలా ఇంత అందంగా ఎలా వున్నావ్‌?”
“వయసుకి, అందానికి సంబంధమేమిటి?” నవ్వింది.
“ఇంత అందంగా హాయిగా ఎలా నవ్వగలవ్‌ నువ్వు?”
“నవ్వడానికి హద్దులున్నాయా నందూ?”
“హద్దుల్లేవుగానీ ఆంక్షలున్నాయిగా”
“ఇక ఏ ఆంక్షలకీ లొంగేదాన్ని కాదు.”
“నాకు తెలుసుగానీ నీకింత లైవ్లీనెస్‌ ఎలా అబ్బింది?”
“జీవితం నేర్పింది”
“ఈ జీవితమా? గత జీవితమా?”
“గత జీవితంలో నుండి నేర్చుకున్న గుణపాఠమే ఈ కొత్త జీవితం”.
“నిన్నెప్పుడూ దిగులుగా, దు:ఖంగా చూడలేదు నేను.”
“నేను దు:ఖసాగరాల్ని, చీకటి అమావాస్యల్ని దాటి వచ్చేసాను. ఇప్పుడంతా పున్నములే, వెన్నెల స్నానాలే”
“నువ్వు మాట్లాడుతుంటే హాయిగా, రిలాక్సింగ్‌గా వుంటుంది.”
“నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా? ఈ రోజు? సినిమా చూడ్డానికి వచ్చి ఈ పనిలో పడ్డావేంటి నందూ”
“ఇది పొగడ్త కాదు నీ సామీప్యత నాకు కలిగిస్తున్న పారవశ్యం. నువ్వు అడుగుపెట్టినంత మేరా నా జీవితం సంతరించుకున్న పచ్చదనం. సినిమా చూసే మూడ్‌పోయింది గానీ నీ నవల ఎంత వరకు వచ్చింది?”
“ఇవాళ ఏమి రాయలేదు. నువ్వు కవిత్వం చెప్తున్నావే?”
“కవిత్వమా? నేనే…నా ముఖం లే. నువ్వెందుకు రాయలేదు?”
“ఆఫీసులో కొంచెం బిజీ. ఇంటికొచ్చేసరికి బాగా అలిసిపోతున్నా.”
“వంట్లో బాగానే వుంది కదా!”
“బాగానే వుంది. డోన్ట్‌ వర్రీ అలసట. అంతే”
“ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుంది?”
“ఏమో! తెలియదు.”
“అదేంటి?టార్గెట్‌ లేదా?”
“సృజనాత్మకతకి టార్గెట్లుండవు బాబూ! ఇదేమైనా ఆఫీసు ప్రాజక్టునుకున్నావా? ఏదో ఒకటి రాసేయడం నాకిష్టం లేదు.”
“నాకేం తెలుసు చెప్పు”.నేనేమైనా రైటర్‌నా?”
“టైమ్‌ చాలడం లేదు. టైమ్‌ దొరికినప్పుడు మూడ్‌ వుండడం లేదు.”
“సరే తల్లీ! నీ నవల , నీ ఇష్టం. తిండానికైమేనా వుందా?”
“ఆకలిగా వుందా? ఇంకా ఏమీ వండలేదు”.
“వండుకుందాం పద”.
“ఫ్రిజ్‌లో కూరలున్నాయి. అన్నం పెడితే చాలు.”
“అయితే నేను కుక్కర్‌ పెడతాను. నువ్వు కూరలు తీసి ఓవెన్‌లో వేడి చేసేయ్‌”.
“సరే! అన్నం అయ్యే లోపల స్నానం చేద్దామా?”
“సరిగంగ స్నానాలా?”
“లేదు జలపాత స్నానాలు”
“జీవితంలో ఇంత సంతోషముంటుందని నిన్ను కలిసాకే నాకు తెలిసింది మధూ.”
“సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా.”
“నిజమే! జలపాత స్నానాలకి జలపాతాల దగ్గరికే వెళ్లనక్కర్లేదు. ఫోర్స్‌గా వస్తున్న ఈ షవర్‌ చాలదా?”
“ఆ ధ్రిల్‌ వేరులే.”
“థ్రిల్‌ వేరేగానీ ఈ దగ్గర తనం అక్కడ కుదరదుగా! తలకోన జలపాతాలు అద్బుతంగా వుంటాయట. వీకెండ్‌కి వెళదామా? మధూ.”
“నీతో రావడానికి ఎక్కడికైనా, ఎప్పుడైనా నేను రెడీ నందూ”.
“ఎక్కడికైనా వస్తావా?”
“ఆహా! ఎక్కడికైనా సరే. ఆకాశం అంచుల దాకా రమ్మన్నా వస్తాను”.
“నా మీద అంత నమ్మకమా?”
“నా మీద నాకు నమ్మకం.”
“నా మీద ప్రేమేనా?”
“మన బంధం మీద నమ్మకం. ప్రేమ.”
“ఈ బంధాన్ని ఏమంటారు?”
“నాకూ తెలియదు. లివింగ్‌ టు గెదర్‌ హేపీలీ.”
“నీకు భవిష్యత్తు గురించి భయం లేదా?”
“ఎవరి భవిష్యత్తు?”
“మనదే”
“ఇప్పుడేమైంది మన భవిష్యత్తుకి?”
“ముందు ముందు ఏం జరుగుతుందో…”
“నాకలాంటి భయాలేం లేవు నందూ. దేన్నయినా ఎదుర్కొవడానకి నేనెప్పుడూ సిద్దమే.”
“ఈ చిన్ని గుండెలో అంత నిబ్బరం ఎక్కడ వుంది? ఎలా వచ్చింది నీకు? గుండె మీద ముద్దు పెట్టాడు.
“జీవితమే నేర్పింది..” తడిగా వున్న అతని పెదాల మీద మధురంగా తన పెదాలాన్చింది. స్నానాలు ముగించి బయటకొచ్చారు.
“అన్నం అయ్యింది తిందామా?”
“నీకు బాగా ఆకలవుతున్నట్లుంది. సారీ. ఆలస్యమైంది.”
“ఏం ఫర్వాలేదులే మధూ. బయట వాతావరణం మారినట్లుందే.”
“అవును. వాన వచ్చేట్టుగా వుంది.”
ఆకాశం నిండా నల్లమబ్బులు . ఉరుములు, మెరుపులు. బాల్కానీలో నిలబడ్డారు. వర్షం మొదలైంది. ఎండాకాలపు వానకి తడిసి మట్టి కమ్మటి వాసనేస్తోంది.
“వానలో తడుద్దామా?” మధుర.
“జలుబు, జ్వరం లాంటి ఏమీ రావుగా”.
“వస్తే రానీ. నాలుగు రోజులు తుమ్మితే నష్టమేమీ లేదు లేవోయ్‌! వానలో తడుస్తూ ఐస్‌క్రీమ్‌ తినడం భలే బావుంటుంది.”
“యూ ఆర్‌ సో డిఫరెంట్‌.”
“ఎలా?”
“వర్షంలో తడవడమే భయం. మళ్లీ చల్లగా ఐస్‌క్రీమ్‌ తినడం.”
“నీకు ఇన్ని భయాలున్నాయా నందూ” అల్లరిగా నవ్వింది. “నాకేం భయాలు లేవు. పద వెళదాం.”
“నీకు రోషమొచ్చినప్పుడు భలే ముద్దొస్తావ్‌ నందూ” అంటూ ముద్దు పెట్టింది. నవ్వేసాడు.” పద వెళదాం మరి.”
ఫ్లాట్‌కి తాళం వేసి లిఫ్ట్‌లో కిందికి దిగారు.
“వాన బాగానే పడుతోంది మధూ.”
“అందుకేగా బయటకి వచ్చాం.”
“బైక్‌ మీద వెళదామా? కారులోనా?
“కారులోనే వెళదాం. మధ్యలో ఆపి నడుద్దాం.”
“ఒకే డన్‌. నువ్వు నడుపుతావా? నేను నడపనా.
“నువ్వే నడుపు. నేను వానని ఎంజాయ్‌ చేస్తాను.
టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేసింది. జగ్‌జీత్‌సింగ్‌ గజల్స్‌. జోరున కురుస్త్తున్న వర్షం మంద్రంగా, మధురంగా విన్పిస్తున్న జగ్‌జీత్‌సింగ్‌ గళం. కొంత దూరం వెళ్లాక…
“ఇక్కడ ఆపు నందూ! కొంచెం సేపు నడుద్దాం…”
ఆ వానలో మధుర చేతిలో చెయ్యేసి నడవడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది నందూకి.
“తడిసిపోయేవేవీ జేబులో లేవుగా నందూ! నేనయితే ఏమి తేలేదు.”
“ఏమి లేవులే. పర్స్‌ కారులోనే పడేసాగా.”
ధారలుగా కురుస్తున్న వాన. ఇద్దరు మొత్తం తడిసి పోయారు.
“మనం పెళ్లి చేసుకుందాం మధూ”
“ఇప్పుడు బాలేదా? మీ వాళ్లు మన పెళ్లికి ఒప్పుకుంటారా?”
“ఒప్పుకోరు”
“మన మధ్య వయసు తేడా! అండ్‌ యూ ఆల్‌ సో లాష్ట్‌ యువర్‌ హజ్బెండ్‌”
“సో వాట్‌? మగవాళ్లే ఎందుకు పెద్ద వాళ్ళయ్యుండాలి? చిమ్మ చీకటిలాంటి నా మొదటి పెళ్లి..నా భర్త మరణం.. ఇందులో నా తప్పేముంది?”
“నేనెప్పుడూ అలా ఆలోచించలేదు మధూ. నీ బలమైన వ్యక్తిత్వం, నీ ప్రేమ, చైతన్యం ముందు అవన్నీ ఎందుకూ కొరగావు.”
“నేను నా గత జీవితంలోని అంధకారంలోంచి బయటపడి వెన్నెల దారుల వెంట నడవాలనుకుంటున్నాను. నందూ! నీ స్నేహం, నీ ఆత్మీయత చాలా అపురూపం నాకు. ఈ చిన్న జీవితంలో అప్పుడే ముఫ్పై యేళ్లు గడిచిపోయాయి. మిగిలిన జీవితాన్నయినా నా కిష్టమైనట్టు మలుచుకోవాలని ఆశ. నీ స్నేహ సాహచర్యంలో దాన్ని సాధించగలననే నమ్మకముంది నాకు…” అతని చేయిని మృదువుగా నొక్కింది.
“మధూ! నీ సామీప్యత, స్నేహం నాకెప్పుడూ కావాలి. పెళ్లయితే నేను మారిపోతానని, మామూలు మొగుడు అవతారమెత్తుతానని నీ అనుమానం కదూ!”
“అలా అని నేన్నానా? అయినా అలాంటి సందర్భం వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు లేవోయ్‌! సహజీవనంలో స్నేహం కరువైతే నా దృష్టిలో అది వేస్ట్‌ట” కళ్లు మిరుమిట్లు గొల్పుతూ ఒక మెరుపు తీగ ఆకాశంలో పరుగులు తీసింది. ఆ వెంటనే ఫెళ ఫెళర్భాటాలతో ఉరుము ఉరిమింది.”
“మధూ నేనెప్పుడూ ఇలాంటి వర్షంలో తడవ లేదు. మా అమ్మ నన్ను వర్షంలో తడవనిచ్చేది కాదు. వానలో తడుస్తూ నడవడం ఇంత అద్భుతంగా వుంటుందని నాకు తెలియదు.”
“జీవితంలోని చిన్న చిన్న ఆనందాలకి, సంతోషాలని మనం ఇలాగా కోల్పోతుంటాం. ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు.”
“నాకు జలుబు చేసి జ్వరమొస్తుందని అమ్మ భయం”.
“ఒక్కోసారి ఏమి కాకపోవచ్చు కూడా. ఏదో అవుతుందనే భయం. మనల్ని పీడిస్తూ ఎన్నింటినో దూరం చేస్తుంది.”
“వెనక్కి వెళదామా? వాన ఇంకా ఎక్కువ అవుతోంది.”
“ఇప్పుడు వాన ఎక్కువైనా తక్కువైనా మనకి నష్టమేమిటి? మొత్తం తడిసిపోయాం కదా?”
“అవుననుకో. అయినా బాగా రాత్రయింది వెళదాం పద.”
“సరే! నాకేమైనా అవుతుందని నీకు భయం మొదలైంది కదూ! ఏమి కాదులే. అయినా ఎలాగూ రేపు డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలిలే” వెనక్కి తిరిగి కారు వైపు నడక సాగించారు. ఇద్దరి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం అల్లుకుంది.
“ఏమాలోచిస్తున్నావ్‌ నందూ! సడన్‌గా కామ్‌గా అయిపోయావేమిటి?”
“ఎందుకో మన మొదటి పరిచయం గుర్తొచ్చింది.”
“ఇంత సంతోషకరమైన వేళ అదెందుకు గుర్తు కొచ్చింది? డాక్టర్‌ దగ్గరికి వెళదామన్నాననా?”
“ఈ సంతోషం శాశ్వతమైతే ఎంత బావుంటుంది మధూ?”
“ఏది శాశ్వతం చెప్పు నందూ! ఈ క్షణంలో ఈ పిడుగులు మన మీద పడొచ్చు. ఏమైనా జరగొచ్చు.”
“నువ్వు చాలా ఫిలసాఫికల్‌గా మాట్లాడగలవు. నీకు రేపటి గురించి భయమేమీ లేదు.”
“భయం లేదని ఎలా అనుకుంటావ్‌? కానీ భయపడి ఏం చేయగలం? మిగిలినకాలానైన్నా సంతోషంగా గడపొచ్చు కదా!”
“పాజిటివ్స్‌ నెట్‌ వర్క్‌ మీటింగ్‌లో నీ మాటలు విని నేను చాలా ప్రభావితమయ్యాను. అప్పటి వరకూ నాకు బతుకంతా నిరాశే. ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు నాకు రక్తం ఎక్కించిన డాక్లర్లని రోజూ శపించేవాడిని. పిచ్చిగా ఏడిచేవాడిని. నీ పరిచయం నాలో తిరిగి జీవితేచ్చను రగిలించింది. మధూ!”.
ఆమె గుప్పిట్లో అతని చెయ్యి వణికింది. కళ్లలోకి ఉబికొచ్చిన కన్నీళ్లు వానధారలో కలిసిపోయాయి.
“నేనూ చాలా ఏడ్చాను నందూ! విలువైన కన్నీళ్లని చాలానే ఒలకబోసుకున్నాను. నా మొగుడు ఆస్తిగా నాకు హెచ్‌ఐవిని పంచి చనిపోయాడు. నా బిడ్డ కూడా పాజిటివ్‌గా పుట్టి చనిపోయింది. బతుకు నిండా చీకటి. కానీ నేను కూడదీసుకున్నాను. మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా గడపాలనుకున్నాను. మనలాంటి వాళ్ల గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొండంత ధైర్యమొచ్చింది. నీ పరిచయం, నీ స్నేహం నాలో అన్ని దిగుళ్లని దూరం చేసాయి నందూ!”
వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కారులో కూర్చున్నాక-
“ఐస్‌క్రీమ్‌ ఏది?”
“కొందాం. మరీ చిన్నపిల్లలా మారాం చేస్తావే.”
“నీ దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర గారం చెయ్యగలను చెప్పు?”
ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ దగ్గర ఆపి రెండు కోన్స్‌ కొనుక్కొచ్చాడు.
“మధూ! రేపు డాక్టర్‌ దగ్గరికి నేనూ వస్తాను. మనం వచ్చే వారం తలకోన వెళుతున్నాంగా.”
“వెళదాం. నీతో ఎక్కడికైనా వస్తానని చెప్పాగా.”
“అలాగే తిరుపతికి వెళదామా?”
“ఎందుకూ?”
“పెళ్లి చేసుకుందాం?”
ఫక్కున నవ్వింది మధుర.
“ఎందుకు నవ్వుతావ్‌?”
“మనకెవడయ్యా తిరుపతిలో పెళ్ళి చేసేది? ఇద్దరు హెచ్‌ఐవి పాజిటివ్‌లు. చిన్న పెళ్లికొడుకు, పెద్ద పెళ్లికూతురు. పైగా భర్త పోయిన దానికి అక్కడ పెళ్లి చేస్తారని నీకు అంత నమ్మకమా నందూ?”
“ఏం? ఎందుకు చెయ్యరు?” ఉక్రోషం ముంచుకొచ్చింది.
“నా పిచ్చి నందూ! నువ్వెంత అమాయకుడివి. అయినా మనం పెళ్లి చేసుకు తీరాలి అని ఎందుకు పట్టుపడుతున్నావ్‌?”
“కారణాలు నేను చెప్పలేను మధూ! నువ్వు దూరం అయితే నేను భరించలేను.”
“నేనెందుకు దూరమవుతాను? ఇద్దరం ఒకే పడవలో కదా! ప్రయాణిస్తున్నాం. పెళ్లి చేసుకోకపోవడం అనేది నా దృస్టిలో అంత ముఖ్యమైనది కాదు. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ, ఆత్మీయత బతికి వుంటే చాలు. మనం బతికున్నంత కాలం హాయిగా వుంటాం. మనకి ఆ బలం చాలదూ?”
“నిజమే అనుకో. నీ ప్రేమే కదా నన్ను బతికిస్తోంది. నీ సాన్నిహిత్యం దూరమైతే నాకు ఇంకేం మిగలదు.”
“నందూ! మన సహజీవనాన్ని సంతోషమనే పునాది మీద పునర్మించుకుందాం. నేను నిన్ను దూరం చేసుకోలేను. మనం మనలాంటి వాళ్లకి ఆదర్శమవుదాం. వాళ్లకి ధైర్యాన్నివ్వడం కోసం పని చేద్దాం. సరేనా!” నందూ చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కింది. ఇంటికొచ్చేసారు.
“కార్లో వెళ్లి కూడా ముద్దలా తడిసిపోయారేంటమ్మా.”
వాచ్‌మెన్‌ ఆశ్చర్యానికి వారిరువురి నవ్వులే సమాధానం.
“ఏంటో… ఎందుకు తడిశారో. ఎందుకు నవ్వుతున్నారో” ముసుగుతన్నాడతడు.
నందూ, మధుర ప్లాట్‌ తాళం తీసి లోపలికెళ్లి తలుపేసుకున్నార

Posted by: kondaveetisatyavati | August 25, 2007

ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు……
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

Posted by: kondaveetisatyavati | August 25, 2007

Next Post

ఒక్కటి కాదు రెండు కాదు
ఐదు బ్రహ్మ కమలాలు

నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ
కమలాలు/వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ
ఒకేసారి పూసాయి.అబ్బ! అంత ఘాటైన



పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు.మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను.

Posted by: kondaveetisatyavati | July 11, 2007

13965090_bhumikasep.jpg

Posted by: kondaveetisatyavati | July 11, 2007

Previous Post

భూమిక గురించి

కొండవీటి సత్యవతి డిసంబర్ 2006

భూమిక ప్రారంభ సంచిక 1993 జనవరి నెలలో విడుదలైంది. సుదీర్ఘమైన ఈ పదిహేనేళ్ళ ప్రయాణం వెనుక మాకెన్నో అనుభవాలున్నాయి. ఒక ప్రత్యామ్నాయ పత్రికగా, ఒక సీరియస్ మాగజైన్‌గా భూమికను బతికించుకుకోవడానికి మేము పడిన శ్రమ, సంఘర్షణ మాటల్లో వర్ణించలేనిది. అయితే ఈ రోజున తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా `భూమిక’ ప్రాచుర్యం పొందడం మాకెంతో గర్వకారణమైన విషయం. మేము పడిన కష్టానికి, ఖర్చు చేసిన కన్నీళ్ళకి తగిన ప్రతిఫలం లభించిన తృప్తి దొరికింది.

భూమిక నేపథ్యం:
1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీవాదం, సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్ని ప్రభావితం చేసింది. తెలుగు దినపత్రికలో స్త్రీల పేజీలను ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితిని స్త్రీవాదం కలగచేసింది. ఈ పేజీల నిండా స్త్రీవాద కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యేవి. స్త్రీవాద సిద్ధాంత చర్చలు తీవ్ర స్థాయిలో జరిగేవి. ఉధృతంగా సాగిన స్త్రీవాద ఉద్యమాలు, ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద ఆలోచనలు ,స్త్రీల సాహిత్యంలో వస్తున్న పరిణామాలు ఇవన్నీ కూడా భూమిక ఆవిర్భావానికి కారణలయ్యాయి. అలాగే ప్రచార వ్యవస్థలో స్త్రీల సమస్యలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం, వార్తా పత్రికలలో స్త్రీల శీర్షికలు నడవటం లాంటివి ఎక్కువైనప్పటికీ ఇవన్నీ కూడా పితృస్వామిక విలువల మూస పద్ధతులకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా వుండడం కన్పిస్తుంది. దీనివల్ల ఒక పక్క స్త్రీల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పించినా, అణిచివేతకు మూలమైన విలువల పునాది మాత్రం యధాతధంగానే వుండి పోయింది. ఏ అంశం మీది చర్చలైనా పితృస్వామిక భావజాలానికి సమ్మతమా, కాదా అనే దానికి లోబడి మాత్రమే ఉండేవి. స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక అవసరం చాలా వుందని భావించి `భూమిక’ రూపకల్పన చేయడం జరిగింది.

భూమిక ఉద్దేశాలు:
- ఏ మాత్రం గుర్తింపు పొందని, అంచుకు నెట్టి వేయబడిన స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుంచీ సేకరించి ప్రచురించడం
- స్త్రీలు సృజనాత్మకమైన తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునే విధంగా చోటు కల్పించటం
- భారతీయ సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ ఉన్న స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయటం
- మూస పద్ధతిలో కాకుండా స్త్రీ వాస్తవ జీవితాశలను ప్రతిబింబించే కథలూ, కవితలూ, పాటలు సేకరించి ప్రచురించటం
- స్త్రీవాద దృక్పథం నుంచీ సాంఘిక – ఆర్థిక – రాజకీయ పరిస్థితులను విశ్లేషణాత్మంగా పరిశీలించటం
- వివిధ రంగాలలో నిపుణులైన స్త్రీ కళాకారుల జీవన పరిస్థితులు, చరిత్ర గురించి వారి మాటల్లోనే పరిచయం చేయటం
- సినిమాలు, టెలివిజన్, రేడియో కార్యక్రమాలపై అలాగే ప్రాచుర్యం పొందిన ఈనాటి సంస్కృతిని సమీక్షిస్తూ చర్చలు నిర్వహించటం
- ఇప్పటివరకూ ముఖ్యమైన విషయాలుగా గుర్తింపబడని స్త్రీల ఆరోగ్యం, కుటుంబ హింస, ఇంటి చాకిరీ వంటి అంశాల గురించి చర్చించటం
- స్త్రీలు, దళితులూ, మైనారిటీలకు సంబందించి ఏ వివక్షతా ధోరణులకూ తావీయని పిల్లల సాహిత్యాన్ని అన్ని భాషలనుంచీ సేకరించి ప్రచురించటం
- స్త్రీల విషయాల మీద ప్రభుత్వ ప్రణాళికలు, వాటి పని తీరు, ఫలితాలపై సమాచారం, అలాగే వాటి మీద స్త్రీల సంఘాల, కార్యకర్తల అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడం
- కులం, మతం, వర్గం వంటి సరిహద్దులు లేకుండా స్త్రీలు తమ జీవితాల్లోని సంఘర్షణలనూ, అనుభవాలను పంచుకోవటానికి అవకాశం కల్పించటం
- స్త్రీల విషయాలపై ఇప్పటి వరకూ ఉన్న చట్టాలు, వాటి వివరాలు, వాటి పని తీరు, న్యాయస్థానాల్లో వివక్షతా ధోరణులు – న్యాయవాదుల ప్రతిస్పందన
- స్త్రీల కోసం స్వయం ఉపాధి అవకాశాలు – వాటి వివరాలు (వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ప్రణాళికల వివరాలు)
- విద్యా, ఉద్యోగ రంగాలలో స్త్రీలకున్న రిజర్వేషన్ సౌకర్యాలు
- స్త్రీల ఆరోగ్య సమస్యలు – వైద్య వ్యవస్థ గురించి అవగాహన
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్త్రీల ఉద్యమాలు, సంస్థల రిపోర్టులు
- పుస్తక సమీక్షలు
- వార్తా సంకలనాలు, సంబంధిత సమావేశాల రిపోర్టులు
- ఛాయా చిత్రాలతో కూడిన వార్తా నివేదికలు

ఈ పదిహేనేళ్ల కాలంలో మేము ఎన్నో ప్రత్యేక సంచికలు తీసుకొచ్చాం. వ్యవసాయ సంక్షోభం, ప్రపంచీకరణ పరిణామాలు, దళిత స్త్రీ సమస్య, చేనేత సంక్షోభం, పిల్లల ప్రత్యేకం, స్త్రీల రాజకీయ భాగస్వామ్యం, తెలంగాణ, రచయిత్రుల ప్రత్యేక సంచిక, స్త్రీలు-మానసికారోగ్యం, హెచ్ఐవి/ ఎయిడ్స్ ఇలా ఎన్నో అంశాల మీద ప్రత్యేక సంచికలొచ్చాయి. పదేళ్ళు నిండిన సందర్భంగా దశాబ్ది ప్రత్యేక సంచిక వెలువరించాం. ఈ సంచికలన్నీ పాఠకుల అభిమానాన్ని పొందాయి.

మొదట్లో `భూమిక’ సమిష్టి కృషిగానే వెలువడినప్పటికీ, వివిధ కారణాలవల్ల ఆనాటి సభ్యులంతా వేరే పనుల్లోకి మళ్ళిపోయారు. `భూమిక’లో పూర్తి కాలం పనిచేయడానికి నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాను. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే కావడం విశేషం. అంతేకాదు ఈ పనంతా స్వచ్ఛందమే. ఎలాంటి జీతభత్యాలు లేవు. స్త్రీల కోసం ఒక ప్రత్యామ్నాయ, సీరియస్ పత్రిక నడపాలన్న తపనతోనే, ఎన్ని సవాళ్ళెదురైనా తట్టుకుని ముందుకు వెళుతున్నాను. ప్రత్యామ్నాయ పత్రిక నడపటం కత్తి మీద సాములాంటిది. నిత్యం ఈ సంఘర్షణ నెదుర్కుంటూనే భూమికను మరింత సమగ్రంగా రూపొందించి ఎక్కువ మంది పాఠకుల్లోకి తీసుకెళ్ళాలన్నది నా ముఖ్య ఆశయం

Posted by: kondaveetisatyavati | July 11, 2007

రండి చేనేతను ప్రేమిద్దాం చేనేతను ధరిద్దాం

భూమిక మే 2007

మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా ఆదరణ కరువై, చేసిన ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర లేక సరైన ప్రభుత్వ సహకారం, విధాన నిర్ణయం కరువై వీరు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వున్నారు.

మన రాష్ట్రంలో ఎన్నో వైవిధ్యభరితమైన చేనేత ఉత్పత్తులు దొరుకుతాయి. ఒకదాన్ని మించి మరొకటి. వెంకటగిరి, మంగళగిరి, గుంటూరు, గద్వాల, పోచంపల్లి, కొయ్యల గూడెం, నారాయణపేట, పెడన, బండారులంక, మోరి, ఉప్పాడ, చీరాల, సిద్దిపేట, మాధవరం, పొందూరు ఖద్దరు ఇలా ఎన్నో ఎన్నెన్నో. వీరి సృష్టి ప్రతీదీ విలక్షణమైనదే. గద్వాల చీర ప్రత్యేకత దానికదే సాటి. ఒకప్పుడు వెంటకగిరి జరీ చీర, అరచేతి మందాన అంచున్న జరీ చీర కట్టు సోషల్ స్టేటస్కు గుర్తింపు. ప్రస్తుతం వెంటకగిరి జరీ చీర వెల వెల బోతోంది. కొయ్యల గూడెం డ్రస్ మెటీరియల్, డిజైన్లు ఎంతో అద్భుతంగా వుంటాయి.ఇంక మంగళ గిరి చీరలు డ్రస్ మెటీరియల్స్, భట్టిప్రోలు పంచెలు, లాల్చి పైజామా బట్ట ఎంతో సౌకర్యవంతంగా వుంటాయి. మన ఉష్ణోగ్రతలకి చక్కగా సూట్ అవుతూ, శరీరానికి హాయినిచ్చే బట్ట చేనేత. నా వరకు నేను చేనేత తప్ప వేరే బట్ట కట్టలేను. నాకు మంగళగిరి, నారాయణపేట్, వెంకటగిరి చీరలంటే ఇష్టం. ఇవి తప్ప వేరేవి సాధారణంగా ధరించలేను. అపుడపుడూ నాకు చాలా దిగులేస్తుంది. కొనేవాళ్ళు, కట్టేవాళ్ళు లేక వీరంతా చీరలు నేయడం మానేస్తే నా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటా? అన్పిస్తుంటుంది.

ఈ రోజు మార్కెట్ల నిండా సింధటిక్, నైలెక్స్, సిల్కు వస్త్రాలు ముంచెత్తాయి. సిల్కు చీరల మీద ఎంబ్రాయిడరీల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. మార్కెట్ శక్తులు ఏదీ ఫ్యాషన్ అని ప్రచారం చేస్తే వినియోగదారులు ఆ మత్తులో కొంత కాలం మునిగి తేలతారు. ప్రస్తుతం ఎంబ్రాయడరీ సిల్కు చీర మార్కెట్ని ఏలుతోంది. పెద్ద పెద్ద మాల్స్లో ఈ చీరల కోసం వేలల్లోనే చెల్లిస్తున్నారు. వీటి ముందు మన చేనేత చీర కళ తప్పిపోతోంది. నేసిన వస్త్రం అమ్ముడు కాక, గిట్టుబాటు ధర లేక, పని లేక నేత పని వారు పస్తులుంటున్నారు.

పెద్ద పెద్ద మిల్లుల యాజమాన్యాలు చేనేతకు ప్రత్యేకమైన డిజైన్లను కాపీ కొట్టి, గుట్టల కొద్దీ సిల్కు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సహజంగానే ఇవి చేనేత కన్నా కారు చవగ్గా దొరుకుతాయి. అరవై, డెభ్భై రూపాయల్లో ఈ రోజు సింధటిక్ చీర దొరుకుతోంది. చేనేతను మెయిన్టెయిన్ చెయ్యడం కొంత శ్రమతో కూడుకొన్నది అవడంవల్ల జనం సింధటిక్ వేపు మొగ్గుతున్నారు. ఈ మొగ్గు చేనేత కార్మికుల జీవితాలకు మరణ శాసనమౌతోంది.

ప్రభుత్వానికి సరైన చేనేత విధానం లేదు. వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత రంగం పట్ల ప్రేమగాని, గౌరవంగాని అసలే లేదు.ప్రభుత్వం చిత్త శుద్ధ్దితో తగిన నిర్ణయాలను తీసుకుంటే చేనేత కార్మికులు తమ పని తాము చేసుకుంటూ తమ బతుకు తాము బతకగలరు. వారేమీ పని చూపించమని దేబిరించటం లేదు. మేము పని చేస్తాం. మా పనికి తగిన ఫలితం ఇవ్వమని కోరుతున్నారు. తమకు అవసరమైన నూలు, తదితర నేతకి అవసరమైన వస్తువుల్ని సక్రమంగా, సరసమైన ధరలకి ఇవ్వమని మాత్రమే కోరుతున్నారు. ఎందుకని ప్రభుత్వం స్పందించడం లేదు? ప్రభుత్వం చేనేతకి చేయూత నిచ్చి, చిత్తశుద్ధితో ఈ క్రింది పనులు చేసి చూపమనండి. మరణశయ్య మీదున్న చేనేత రంగం జవజీవాలతో కళ కళలాడుతుంది.

  • ప్రభుత్వం కొనుగోలు చేసే బట్టనంతా చేనేత నుండే కొనాలి.
  • ప్రభుత్వ కార్యాలయాలో వాడే సమస్తమైన బట్టని -కర్టెన్లు, దుప్పట్లు, టవళ్ళు, నేప్కిన్లు, ఆసుపత్రుల్లో వాడే వస్త్రాలు, అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లోను వాడే వస్త్రాలు
  • ప్రభుత్వోగులకు సబ్సిడిగా ఇచ్చే రుణాల్ని పునరుద్ధరించాలి. ఇది తప్పనిసరిగా వెంటనే చెయ్యాలి. సంవత్సరానికి ఒకసారి పండుగలకి ఇచ్చే ఈ రుణం ప్రభుత్వోద్యోగుల కుటుంబానికి కావలసిన చేనేత వస్త్రాలను సమకూర్చుతుంది. నేత కార్మికులకు పనీ చూపెడుతుంది.
  • తెల్లకార్డుదారులందరికీ జనతా వస్త్రాలు సబ్సిడీ రేటుకి సరఫరా చెయ్యాలి. వీటి పంపకాన్ని ఇందిరమ్మ పధంలో పని చేస్తున్న మహిళా సమాఖ్యలకి అప్పగించాలి.
  • చేనేత వస్త్రాల వాడకం గురించి ఉద్యమ రూపంలో ప్రచారం చెయ్యాలి. తాము కొన్న ఒక చేనేత వస్త్రం ఒక కుటుంబానికి ఎలా జీవనాధారమో విడమరిచి చెప్పాలి.
  • చేనేత వస్త్రాన్ని ప్రేమించడం అంటే చేనేతలో వున్న లక్షలాది కుటుంబాలను ప్రేమించడమే. వారిని ఆత్మహత్యల నుంచి మళ్ళించడమే.
  • ఎనిమిది కోట్ల జనాభాలో కొన్ని లక్షల మంది చేనేతను ఆదరించినా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళవుతారు
Posted by: kondaveetisatyavati | July 11, 2007

Next Post

“ది అదర్‌ హాఫ్‌” కోసం కలానికి పదును పెట్టిన కల్పనా శర్మ

భూమిక జూన్ 2007

కల్పనా శర్మ. హిందూ పేపర్‌ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్‌ హిందూ చీఫ్‌ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్‌ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్‌, బెంగుళూరు విభాగం వారు చక్కగా సెలబ్రేట్‌ చేసారు. కల్పనా శర్మ గౌరవార్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ముఫ్ఫై నాలుగు సంవత్సరాలు జర్నలిష్టగా పని చేసి అంచెలంచెలుగా అనేక పదవుల్ని అలంకరించిన కల్పన ఎంతో నిబద్ధత కల్గిన జర్నలిస్ట్‌గా ప్రసిద్దురాలు. హిందూ, సండే మేగజైన్‌లో ‘ద అదర్‌ హాఫ్‌ “ పేరుతో తను రాసే కాలమ్‌లో భిన్నమైన మహిళా సమస్యల గురించి, జండర్‌ అంశాల గురించి రాసారు. సీరియస్‌ చర్యలను లేవనెత్తింది ఆమె కాలమ్‌.

“హిమ్మత్‌” అనే మేగజైన్‌లో తన వృత్తిని ప్రారంభించింది కల్పన. ‘హిమ్మత్‌’ చిన్న పత్రిక ఐనప్పటికీ చాలా గౌరవం పొందిన పత్రిక. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని వ్యతిరేకించి, పత్రికల మీద సెన్సార్‌షిప్‌కిి వ్యతిరేకంగా గొంతు విప్పిన పత్రికగా పేరుంది. అంతేకాదు ప్రధాన స్రవంతి పత్రికలు చేయలేని ఈ ధైర్యాన్ని చేసిన పత్రిక ‘హిమ్మత్‌’ . ఇలాంటి నిబద్ధత కల్గిన పత్రికలో కల్పనా శర్మ జర్నలిస్ట్‌గా తన జీవితాన్ని ప్రారంభించడం విశేషం.

క్రమంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లాంటి జాతీయ పత్రికల్లో ఉన్నత స్థాయిల్లో పని చేసింది. ప్రస్తుతం హిందూలో డిప్యూటీ ఎడిటర్‌గా వుంది. తన 60 సంవత్సరాల జీవితంలో దాదాపు సగం కంటే ఎక్కువే అంటే 34 సంవత్సరాలు తన వృత్తికే అంకితమైంది కల్పనా శర్మ.

అభివృద్ధి అంశాల గురించి, జెండర్‌, పర్యావరణం గురించి లెక్కలేనన్ని వ్యాసాలు రాసింది. ముఖ్యంగా స్త్రీ సమస్య గురించి, జెండర్‌ అంతరాల గురించి కల్పన చాలా విశ్లేషణాత్మకమైన, లోతైన పరిశీలనతో రాసిన వ్యాసాలు చాలా ప్రాచుర్యం పొందాయి. కల్పన అమ్ముజోసఫ్‌తో కలిసి రాసిన who’s news? the media and women’s issues పుస్తకం వార్తల్లో స్త్రీల అంశాలనెలా చూపుతారు, మొత్తం వార్తా కధనాల్లో స్త్రీలకు సంబంధించిన విషయాలకు ఎంత ప్రాధాన్యత వుంటుంది లాంటి ప్రశ్నలను సంధించిన ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. 2000 సంవత్సరంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ‘ధారవి’ గురించిన కథలతో ఒక పుస్తకాన్ని కల్పనా శర్మ రచించింది. 2003లో అమ్ము జోసఫ్‌ సహ సంపాదకత్వంలో “Terror counter – Terror women speakout” పుస్తకాన్ని కల్పనా శర్మ రూపొందించారు.

బెంగూళూరులో ఇటీవల జరిగిన సమావేశంలో మాట్లాడుతూ “ నేను నా ఉద్యోగం నుండి రిటైర్‌ అవుతున్నాను కాని నా వృత్తి నుంచి కాదు. నేనెప్పటికీ జర్నలిస్ట్‌గానే కొనసాగుతాను. స్వతంత్ర జర్నలిస్ట్‌గా నా కొత్త వృత్తిని ప్రారంభించబోతున్నాను” అన్నారు. “నేను హిమ్మత్‌ పత్రికలో జర్నలిస్ట్‌గా నా వృత్తిని మొదలు పెట్టినప్పుడు మా సీనియర్‌లు మాకు ఎన్నో కొత్త విషయాల గురించి చెప్పేవారు. మంచి శిక్షణ నిచ్చేవారు. నేను కూడా వృత్తిలోకి కొత్తగా వచ్చిన యువ జర్నలిస్ట్‌లతో ఎక్కువ సమయం గడపాలనుకుంటాను. వారికి నా సహాయ సహకారాలు ఎపుడూ వుంటాయి.”

నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ వుమెన్‌ జర్నలిస్ట్‌లో కల్పనా శర్మ సభ్యురాలు. ఈ నెట్‌ వర్క్‌ ఏర్పాటులో, జాతీయ స్థాయి వుమన్‌ జర్నలిస్ట్‌ నెట్‌వర్క్‌ సమావేశాల రూపకల్పన, నిర్వహణలో అమ్ము జోసఫ్‌, కల్పనా శర్మల పాత్ర అమూల్యమైంది. ఈ నెట్‌వర్క్‌లో సభ్యులైన మహిళా జర్నలిస్ట్‌లు Responsive, Responsible and gender sensitive జర్నలిజం కోసం కృషి చేస్తున్న విషయం విదితమే.

60 వసంతాలు పూర్తి చేసుకుని, బాధ్యతాయుతమైన జర్నలిస్ట్‌గా 34 సంవత్సరాలు పని చేసి, స్వతంత్ర జర్నలిస్ట్‌గా తిరిగి తన వృత్తికే అంకితం అవ్వాలనుకుంటున్న కల్పనా శర్మ నిజంగానే విశిష్ట కల్గిన పాత్రికేయురాలు. స్త్రీల పట్ల ఎంతో వివక్షత వున్న మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో తన ప్రతిభతో, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన కల్పనా శర్మకి భూమిక అభినందనలు తెలుపుతోంది.

Posted by: kondaveetisatyavati | June 24, 2007

Saturday, June 23, 2007


ఫోనులో… సాంత్వన !
భూమిక జూన్ 2007

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్యాలయానికి పలువురు మహిళలు చేసిన ఫోన్లు చూశాక అలాంటి వారికి సాంత్వనిచ్చి..భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఆ యోచన కార్యరూపం దాల్చింది. ఇప్పటిదాకా పదిహేను వందలకు పైగా కేసులను పరిష్కరించాం’అని వివరించారామె.

ఎలా పనిచేస్తుంది?

భూమిక టోల్‌ఫ్రీ నంబరుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ చేసి కౌన్సెలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఇక్కడ కౌన్సెలర్లుగా ఉన్నారు. ఉదయం ఎనిమిదినుంచి రాత్రి ఎనిమిదింటివరకు ఈ నంబరు సేవలందిస్తుంది. చాలావరకు కేసులకు కౌన్సెలింగ్‌ సరిపోతుందని, నిపుణుల అవసరం ఉన్నప్పుడు మళ్లీ చేయమని చెప్తామని, అవసరమైతే ఇతర కౌన్సెలింగ్‌ కేంద్రాల నంబర్లు, వారి వారి ప్రాంతాల్లో సహాయం అందించగల సంస్థల నంబర్లు కూడా వారికి ఇస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ సేవలందించడానికి కొందరు వృత్తి నిపుణులు కూడా తరచూ వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచీ ఫోన్లు వస్తుంటాయనీ కోస్తా ఆంధ్రా, గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాలనుంచీ వచ్చేవే అధికమన్నారు. ఎక్కువ శాతం కేసులు గృహహింసకు సంబంధించినవేననీ వివరించారు. అయితే గత రెండు నెలలుగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారామె. ఒత్తిడినెదుర్కొంటున్న విద్యార్థినులు, అపరిపక్వ ప్రేమలు వాటి తాలూకు పరిణామాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే వస్తున్నాయని కార్యకర్తలు వివరించారు.

మంచి పని ఇప్పిస్తానని చెప్పిన బ్రోకరుని నమ్మి గోదావరి జిల్లానుంచి మాల్దీవులకు చేరిందో మహిళ. అక్కడికెళ్ళాక తాను మోసపోయానన్న విషయం తెలిసి .ఎలాగో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. తర్వాత ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు సత్యవతి. పాస్‌పోర్టు తదితర పత్రాలేవీ లేకుండా విమానం దిగిన ఆ మహిళను అధికారులు తిరిగి త్రివేండ్రం పంపించేశారు. తెలుగు తప్ప మరో భాషరాని ఆమెను తెలుగు వనితగా గుర్తించి కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థ సత్యవతికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, ఛార్జీలకు డబ్బు పంపి, క్షేమంగా ఇల్లు చేరుకునేలా చేశాం. మరో కేసులో అత్యాచారం చేయబోయిన కన్నతండ్రినుంచి ఇద్దరు కుమార్తెలను కాపాడామన్నారు. ఇలాంటి సీరియస్‌ కేసుల విషయంలో పోలీసు అధికారులు, జిల్లాల్లో న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోనూ సంప్రదించి బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.

హెల్ప్‌లైన్‌లో…

ఫోన్‌ మోగగానే తీస్తారు.
ఫోన్‌ చేసిన స్త్రీ చెప్పేదంతా సహనంతో, సానుభూతితో వింటారు.
వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు.
కేసుని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు తప్ప తీర్పరితనంతో వ్యవహరించరు.
పరిస్థితి మరీ సీరియస్‌గా ఉందనుకుంటే స్థానిక పోలీసు యంత్రాంగం, కుటుంబహింస చట్టానికి సంబంధించిన రక్షణాధికారి, స్వచ్ఛంద సంస్థలవారిని అప్రమత్తం చేస్తారు.
(సలహా, సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 సంప్రదించవచ్చు)

Posted by: kondaveetisatyavati | May 20, 2007

Previous Post

ఆదివారం నాటి నా పాత పుస్తకాల షాపుల దర్శనానుభవం వ్యాసానికి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.నిజమే పుస్తకం ఓ ప్రియ నేస్తం స్థానం నుంచి జారి పోయిన మాట వాస్తవమే.ఆత్మీయతని పంచే,అనుభవాల విపంచిని కళ్ళముందు పరిచే పుస్తకం ఎక్కడ?గోపిచంద్ “మెరుపుల మరకలు” పి. శ్రీ దేవి ‘కాలాతీత వ్యక్తులు” రాహుల్ సాంఖ్రుత్యాయన్ “వోల్గా నుండి గంగా వరకు” ప్రేంచంద్ “గోదాన్” సరత్చంద్రుని “శ్రీకాంత్” లాంటి జీవితాన్ని మలుపు తిప్పిన అద్భుతమైన పుస్తకాలు పాత పుస్తకాల షాపుల్లోనే కొనుక్కోగలిగిన ఆ నాటి ఆర్ధిక వొత్తిళ్ళలో కూడా ఎంత సంతోషమో పుస్తకాలు కొనుక్కోగలిగినందుకు. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటే మరెంతో ఆనందం.భాగ్యనగరంలో వెలుస్తున్న మహా మల్స్ సందర్శనం నాలాంటి వాళ్ళకు అదనంగా ఒరగబెట్టేది ఏమి ఉండదు కూడా.ఈ మెగా షాపుల్లో ప్రదర్శించే వస్తు సముదాయం వస్తు వ్యామోహాన్ని పెంచుతుందేమో గానీ నా వరకు ఎలాంటి ఆనందాన్నీ ఇవ్వలేవు.నా ఆనందం స్నేహితుల్లో, వాళ్ళకు రాసే ఉత్తరాల్లో,పుస్తకాల్లో,ప్రక్రుతిలో,నా పనిలో,నా చుట్టూ అల్లుకున్న నా కిష్టమైన పరిసరాల్లో ఉంది.మా ఊరు, మాగోదావరి,మా సముద్రం,మా ఊరి పచ్చదనం ఇచ్చినంత కిక్కు నాకు మరేది ఇవ్వలేదు.మా గోదావరి ప్రవాహం,మా సముద్ర కెరటం చాలవా నా గుండెల్లో ఆనందాన్ని నింపడానికి?

Posted by: kondaveetisatyavati | May 20, 2007

ఈ రోజు మధ్యాహ్నం ఎండవేళ విసుగ్గా,చిరాగ్గా ఇంట్లో వున్నవేళ
ఓ నీలిరంగు ఉత్తరం పిట్ట అలా అలా ఎగురుకుంటూ వచ్చి నా ముంజేతి మీద వాలింది.అద్భుతం.
విసుగంతా మాయమైపోయింది.ఎన్నాళ్ళకెన్నాళ్ళకి.చాలా రోజులుగా కంటాక్టులో లేని శుభ రాసిన ఉత్తరమది.ఇటీవల మా ఊ రెళ్ళినప్పుడు నా అడ్రస్సు సంపాదించి ఈ ఉత్తరం రాసిందట.
శుభ రాసే ఉత్తరాలు, ఆ చేతి వ్రాత నాకు చాలా ఇష్టం.
మేమిద్దరం ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం.బోలెడన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.
నాకు ఉత్తరం రాయడమంటే ఎంతో ఇష్టం.నా ప్రియ నేస్తాలకి నేను రాసిన ఉత్తరాలు ఫైళ్ళల్లో నిండి ఉన్నాయి.వళ్ళు వాటిని భ ద్రంగా దాచుకున్నారు.ఎన్నో సార్లు హాయిగా కూర్చుని వాటిని చదువుకోవడమూ ఉంది.
జయ అని నాకు 30 సంవత్సరాలుగా ఆత్మీయురాలైన ఓ నేస్తముంది.మా స్నేహం నిత్యనూతనంగా అలరారుతూనే ఉంది.ఈ 30 ఏళ్ళలో తనకు నాకు మధ్య నడిచిన ఉత్తరాలు ఇంకా భద్రంగా ఉన్నాయి.నాకు సంబంధించి నా 30 ఏళ్ళ జీవితం వాటిల్లో దాగి ఉంది. ఇప్పుడు వాటిని చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణించలేను.బతుకుపోరాటం,అప్పటి ఆశయాలు, ఆరాటాలు,ఆవేశాలు,ఉద్యమాలు,ఉద్యోగాలు ఒకటా రెండా …ఎన్నో ఎన్నెన్నో…చదువుకున్న పుస్తకాలు,చూసిన ప్రదేశాల వివరాలూ.అన్నీ అక్షరబద్దమై ఉన్నాయి.
నా వరకు నేను మా ఊరికి దూరమవ్వనట్టుగానే ఉత్తరాలకి దూరమవ్వలేదని చాలా గర్వంగా చెప్పగలను.ఇప్పటికి నేను ఉత్తరాలను ప్రేమగా,ఆత్మీయంగా నా ప్రియ నేస్తాలకి రాస్తూనే ఉన్నాను.
నా ద్రుష్టిలో ఉత్తరమనేది ఉత్త కాయితం ముక్క కాదు.ఉద్వేగాల గని.ప్రవహించే జీవ నది.గుండెలోని ఊసుల్ని వేళ్ళ కొసల ద్వారా వ్యక్తీకరించేదే ఉత్తరం.

Older Posts »

Categories